Saturday, 21 January, 2017
cmkcr-ts27

ఇందిర‌మ్మ ఇళ్ల అవినీతిపై నిగ్గు తేల్చుతాం కేసీఆర్‌

సీఎం కేసీఆర్ ఉంటున్న ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో 150 గ‌దులు ఉన్నాయంటూ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ తీవ్రంగా మండిప‌డ్డారు. మంగళ‌వారం అసెంబ్లీలో డ‌బుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై జ‌రుగుతున్న చ‌ర్చ సంద‌ర్భంగా కేసీఆర్ కు కోమ‌టిరెడ్డికి మ‌ధ్య మాట‌ల‌యుద్ధం న‌డిచింది. ప్రగతి భవన్ తెలంగాణ ప్రజల ఆస్తి తప్ప.. కేసీఆర్ ఇల్లు కాదని స్పష్టం చేశారు.ప్రగతి భవన్‌లో 150 గదులున్నాయా? అయితే చూపించండి అంటూ వారిపై మండిప‌డ్డారు. పేప‌ర్ల‌లో వ‌చ్చే వాటిని ఆధారంగా చేసుకొని సీఎం నివాసం గురించి అల్పంగా మాట్లాడటం సరికాదని హిత‌వు ప‌లికారు. క‌నీసం ముఖ్య‌మంత్రి కాన్వాయ్ కూడా పార్కింగ్ చేసుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతోనే ప్ర‌గ‌తి భవ‌న్ నిర్మించ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పాల‌న‌లో జ‌రిగిన ఇందిర‌మ్మ ఇళ్లు అన్నింటిలోనూ భారీ అవినీతి జ‌రిగింద‌ని విమర్శించారు. వారిలా మేము డబ్బా ఇళ్లను కట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. బలహీన వర్గాల ఇండ్ల నిర్మాణంలో అవినీతికి తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఒకసారి ఇల్లు కడితే రెండు తరాలకు ఉపయోగపడేలా నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్లలో జరిగిన అవినీతిని బయటకు తేవాలని తాము అధికారంలోకి రాగానే 2014లో సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని తెలిపారు.