Saturday, 18 November, 2017

ప‌న్నులు క‌ట్ట‌క‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు-అరుణ్ జైట్లీ

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై సర్వత్రా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ తక్కువ పన్నుల గురించి సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయ పోటీతత్వానికి అనుగుణంగా దేశం తక్కువపన్నుల దశలోకి అడుగుపెట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు.భార‌త్‌లో కొందరు ప‌న్నుల ఎగ‌వేత‌ను తెలివైన పనిగా భావిస్తున్నారని, ప్ర‌స్తుతం అటువంటి వారు భారీ మూల్యమే చెల్లించారన్నారు.. ఈ రోజు ఐఆర్‌ఎస్‌ 68వ బ్యాచ్‌ వృత్తి శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్స‌వంలో జైట్లీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జైట్లీ మాట్లాడుతూ.. ప్రపంచంతో పోటీ పడాలంటే దేశంలో పన్నుల విధానంలో మార్పు రావాలని అన్నారు. ప్ర‌స్తుతం మనకు కావాల్సింది పన్నులు తక్కువగా ఉండటమేన‌ని, పోటీతత్వంతో స‌ర్వీసు మెరుగుపడుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.ప‌న్నులు చెల్లించడం పౌరుల బాధ్యతని, త‌ద్వారానే దేశ ఆర్థిక రంగం అభివృద్ధి చెందుతుందని జైట్లీ చెప్పారు. ప్రభుత్వ అధికారులకు ఆయ‌న ప‌లు సూచ‌న‌లు చేస్తూ వారిలో నిజాయతీ, శ్ర‌మించే తత్వం, కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం ఉండాల‌ని అన్నారు. దేశంలో పన్నుల ఎగవేత అనేది అధికంగా ఉంద‌ని, గత డెబ్బై ఏళ్లుగా ఇదే ప‌రిస్థితి ఉంద‌ని ఆయ‌న అన్నారు. ప‌న్ను ఎగ‌వేత అనేది వారికి తప్పుగా అనిపించడం లేదని జైట్లీ వ్యాఖ్యానించారు.